కాకతీయ ఎఫెక్ట్
గోదారిలో ఇసుక మాఫియాకు బ్రేక్
ముళ్లకట్ట బ్రిడ్జి తీరంలో ట్రెంచ్ కొట్టిన అధికారులు
అక్రమ రవాణా చేస్తే కేసులు తప్పవని తహసీల్దార్ హెచ్చరిక
కాకతీయ, ఏటూరునాగారం: ముళ్లకట్ట గోదావరి తీరంలో ఇసుక దొంగలకు చెక్ పెట్టే దిశగా రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారంపై మే 16న ‘కాకతీయ’ దినపత్రికలో “గోదావరిలో ఇసుక దొంగలు” అనే శీర్షికతో ఆధారాలతో సహా ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా ఏటూరునాగారం రెవెన్యూ అధికారులు సోమవారం ముళ్లకట్ట గ్రామ పరిధిలో గోదావరి నదిలోకి వాహనాలు దిగే ప్రధాన రహదారిని నిలిపివేస్తూ భారీ ట్రెంచ్ (అగడ్త) తవ్వించారు. ఈ చర్యతో అర్ధరాత్రి వేళల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణాకు గట్టి బ్రేక్ పడింది.

వాహనాలు సీజ్ చేస్తాం
ఈ సందర్భంగా ఏటూరునాగారం మండల తహశీల్దారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే సహించేది లేదన్నారు. అధికారులు తవ్వించిన ట్రెంచ్‌ను తొలగించి అక్రమ రవాణాకు ప్రయత్నించినా, అనుమతులు లేకుండా ఇసుక తరలించినా సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గోదావరి తీరంలో నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ ట్రెంచ్ ఏర్పాటు పర్యవేక్షణలో మండల గిర్దవార్ కిరణ్ కుమార్, జీపీఓ వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

