యువత సన్మార్గంలో పయనించాలి
సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : యువత క్రమశిక్షణతో సన్మార్గంలో పయనిస్తూ లక్ష్యసాధనకు కృషి చేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ బట్ సూచించారు. సంజోష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల పరిధిలో పదో తరగతి (500కు పైగా మార్కులు), ఇంటర్మీడియేట్ (900కు పైగా మార్కులు)లో ప్రతిభ కనబరిచిన సుమారు 90 మంది విద్యార్థులకు సోమవారం స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఏఎస్పీ, ఫౌండేషన్ అధ్యక్షుడు సంజోష్, సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కలిసి విద్యార్థులకు రూ.2 వేల చొప్పున నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. యువత తప్పుడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మైనర్ బాలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైకోర్టు న్యాయవాది పూజారి నాగేశ్వరరావు, ఫౌండేషన్ అధ్యక్షుడు సంజోష్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. నటుడు సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. చిన్నచిన్న ఇబ్బందులకు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ సిద్ధార్థరెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎంఈఓ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


