ములుగులో రేపటి నుంచి పర్యాటక వారోత్సవాలు
మే 20న జాకారం శివాలయం వద్ద హెరిటేజ్ వాక్
కంటెంట్ క్రియేటర్ల కోసం రీల్స్ కాంపిటీషన్.. నగదు బహుమతులు
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు వెల్లడి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో పర్యాటక శాఖకు సంబంధించిన బ్రోచర్లు, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని చాటిచెప్పేలా మే 18 నుంచి 23 వరకు పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మే 20న ములుగు మండలం జాకారం శివాలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మే 21న యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేయడానికి ‘ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ కాంపిటీషన్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు
ఈ పోటీల్లో పాల్గొనే కంటెంట్ క్రియేటర్లు ములుగు జిల్లా పర్యాటక ప్రాంతాలపై తీసిన 4కే వీడియోలను మే 21 నుంచి 30 వరకు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మొదటి బహుమతిగా రూ.21,000, ద్వితీయ బహుమతిగా రూ.15,000, తృతీయ బహుమతిగా రూ.10,000 నగదును అందజేస్తామన్నారు. విజేతలను జూన్ 2న ప్రకటిస్తామని, బహుమతులు రాకపోయినా మంచి కంటెంట్ ఉన్న వీడియోలను జిల్లా అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో క్రియేటర్ల పేర్లతో ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. సంపత్ రావు, పర్యాటక శాఖ అధికారి శివాజీ, డీపీఆర్ఓ తదితరులు పాల్గొన్నారు.

