ఇసుక లారీలను బలవంతంగా ఆపడం సరికాదు
ధాన్యం కాంట్రాక్టర్ల అసమర్థతకు మేం బలికావాలా..?
వేధింపులు కొనసాగితే ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేస్తాం
:ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ గౌడ్ నిలదీత
కలెక్టర్, రవాణా శాఖాధికారులకు వినతిపత్రం అందజేత
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ ఇసుక లారీలను బలవంతంగా వాడుకోవడం ఏమిటని పెద్ద అంబార్ పేట ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలగోని భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ధాన్యం రవాణా కోసం ఐకేపీ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, తాము కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జనగామ జిల్లా కలెక్టర్ మరియు రవాణా శాఖాధికారికి తమ అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందజేశారు. ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాస్కర్ గౌడ్ విమర్శించారు. ఐకేపీ సెంటర్ల కోసం కాంట్రాక్టులు దక్కించుకునే సమయంలో, తమ వద్ద నాలుగు నుండి ఐదు వందల లారీలు ఉన్నాయని కాంట్రాక్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్టులు పొందారని ఆయన ఆరోపించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 50 నుండి 100 లారీలను మాత్రమే అందుబాటులో ఉంచడం వల్ల ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని, దీనివల్ల రైతులు కల్లాల వద్ద వారాల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక లారీ యజమానుల ఆర్థిక నష్టం
కాంట్రాక్టర్ల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రవాణా శాఖ అధికారులు రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి, డ్రైవర్ల ఫోన్లు లాక్కొని బలవంతంగా కల్లాలకు తరలిస్తున్నారని భాస్కర్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన కిరాయిలు రాక ఇబ్బందులు పడుతున్నామని, ఇసుక లోడుతో వెళ్తున్న లారీలు సమయానికి దిగుమతి కాక 4 నుంచి 7 రోజుల పాటు నిలిచిపోతున్నాయని, దీనివల్ల లారీ యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన వాపోయారు.
ప్రభుత్వానికి హెచ్చరిక
ధాన్యం రవాణా కాంట్రాక్టు పొందిన వ్యక్తులు ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో లారీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు ఇసుక లారీలను వేధిస్తే, భవిష్యత్తులో ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, సంబంధిత కాంట్రాక్టర్లపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, భవిష్యత్తులో ధాన్యం రవాణా కాంట్రాక్టులను కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా లారీ యూనియన్లకే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే లారీ యజమానులందరం కలిసి భారీ స్థాయిలో ఉద్యమించాల్సి ఉంటుందని భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

