సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిలోనే జరగాలి
గ్రామాల్లో ప్రత్యేక మీటింగ్‌లు పెట్టి టార్గెట్ పూర్తి చేయాలి
యువత, మహిళలు, రైతులను పార్టీలో చేర్చడమే లక్ష్యం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్దవంగరలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమీక్షా సమావేశం
కాకతీయ, పెద్దవంగర : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వంద శాతం డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దవంగర మండల కేంద్రంలోని పార్టీ ఆఫీస్‌లో మండల ముఖ్య నాయకులు, గ్రామ ఇన్చార్జిలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలను, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. యువత, మహిళలు, రైతులు, కార్మికులను పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదులో భాగస్వాములను చేయాలని చెప్పారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈసారి డిజిటల్ విధానంలో మెంబర్‌షిప్ డ్రైవ్ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇన్‌చార్జిల నిరంతర పర్యవేక్షణ
ప్రతి గ్రామంలోనూ స్పెషల్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి, సభ్యత్వ నమోదు ఎలా సాగుతుందో నియోజకవర్గ, మండల నాయకులతో పాటు గ్రామ ఇన్‌చార్జిలు నిరంతరం పర్యవేక్షించాలని ఎర్రబెల్లి సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు రామచంద్రయ్య శర్మ, ప్రధాన కార్యదర్శి సంజయ్, పార్టీ ప్రతినిధులు సుధీర్ బాబు, సుధాకర్, వెంకన్న, హరీష్‌లతో పాటు గ్రామ ఇన్‌చార్జిలు, యూత్ మరియు సోషల్ మీడియా విభాగాల నాయకులు పాల్గొన్నారు.

