ఓటర్ మ్యాపింగ్ పెంపుపై ప్రత్యేక దృష్టి
ఓటరు వివరాలు తప్పుల్లేకుండా నమోదు కావాలి
పోలింగ్ కేంద్రాల్లో యుద్ధప్రాతిపదికన ప్రత్యేక క్యాంపెయిన్లు
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
శివనగర్, చింతల్ ప్రాంతాల పోలింగ్ కేంద్రాల్లో పర్యటన
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతాన్ని వంద శాతానికి చేర్చడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నియోజకవర్గంలో ఓటర్ మ్యాపింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం వరంగల్ మరియు ఖిలా వరంగల్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ‘ఎస్‌ఐఆర్’ కార్యక్రమంలో భాగంగా.. ఓటర్ మ్యాపింగ్ శాతాన్ని పెంచేందుకు పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లను నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో కలెక్టర్ సమీక్ష
ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద స్వయంగా రంగంలోకి దిగారు. వరంగల్ నగరంలోని శివనగర్, చింతల్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె సర్ప్రైజ్ విజిట్ చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. అనంతరం బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు తహసీల్దార్లతో కలెక్టర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ మ్యాపింగ్ శాతాన్ని వేగంగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కఠిన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఎలాంటి తప్పులు లేకుండా, సరైన విధంగా నమోదు అయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై విస్తృతంగా అవగాహన కల్పిస్తూ, ఓటర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఓలపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ తహసిల్దార్ శ్రీకాంత్, ఖిలా వరంగల్ తహసిల్దార్ ఇక్బాల్‌తో పాటు పలువురు రెవెన్యూ, ఎన్నికల విభాగాల అధికారులు పాల్గొన్నారు.

