మహిళల ఆర్థిక సాధికారతకు ముందడుగు
మడికొండలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్
మహిళలను యజమానులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాల ఆదాయ వనరుల విస్తరణకు దోహదం
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య
మహిళా సభ్యులకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ
కాకతీయ, హనుమకొండ : మహిళల ఆర్థిక సాధికారత సమాజాభివృద్ధికి కీలకమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో డీఆర్‌డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో 1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌కు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో కలిసి ఆమె సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగానే కాకుండా యజమానులుగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తోందన్నారు.
ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత
మహిళా సంఘాల ద్వారా వివిధ రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణలోనూ ఆదర్శంగా నిలుస్తారని ఎంపీ కడియం కావ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆదాయ వనరుల విస్తరణకు ఈ పెట్రోల్ బంక్ దోహదపడుతుందని మహిళల ఆర్థికాభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. అనంతరం ఐనవోలు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి మహిళా సభ్యులకు ఆర్థిక సహాయ చెక్కులను అందజేశారు. మహిళలు వ్యవసాయ అనుబంధ రంగాల్లో మరింత ముందుకు సాగి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, బీపీసీఎల్ ఎండీ సుధీర్, ఐకేపీ రీజినల్ కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐకేపీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

