ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలు తగ్గించాలి…
*ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్
కాకతీయ, గీసుగొండ: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని ఎల్కుర్తి హవేలీ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన ప్రజలకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గ్రామాల్లో, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ ఎన్. వెంకటేష్, గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్, ఎస్‌ఐ కె. కుమార్, పోలీస్ సిబ్బంది,గ్రామ సర్పంచ్ దివ్యభారతి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్,ఉపసర్పంచ్ నల్ల సురేష్,వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
*పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిసిపి…
గీసుగొండ పోలీస్ స్టేషన్ ను ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీలు, వివిధ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్లు, కేడీ షీట్ హోల్డర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పూర్తి చేసి సమయానుకూలంగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తనిఖీ అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.


