పోలీసుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో ఘటన
ఎస్సై బెదిరింపులతో తీవ్ర మనోవేదనకు గురైన గొర్రెల కాపరి
ఏసీపీకి లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితుడు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పోలీసుల తీరుపై విసిగిపోయి, తనకు న్యాయం దక్కదనే ఆవేదనతో ఓ గొర్రెల కాపరి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెక్కొండ మండలంలో సంచలనం సృష్టించింది. వెంకటాపురం గ్రామానికి చెందిన గాడుదల వెంకన్న (52) ఆర్థిక లావాదేవీల వివాదం మరియు పోలీసుల బెదిరింపుల కారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెంకన్న భార్య లింగమ్మ ఈ నెల 16న జీవాలను అమ్మేందుకు నెక్కొండ సంతకు వెళ్తుండగా, తండాకు చెందిన కొంతమంది వ్యక్తులు ఆమెపై దాడి చేసి జీవాలను ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించ లేదని వెంకన్న ఆరోపించారు. బాధితుడు వెంకన్న ఆరోపణల ప్రకారం… నెక్కొండ ఎస్సై మహేందర్ నిందితులకు కొమ్ముకాస్తూ బాధితుడైన వెంకన్ననే బెదిరించారు. “నిందితుల జోలికి వెళ్తే నీపైనే అట్రాసిటీ కేసు పెడతాం” అంటూ ఎస్సై హెచ్చరించడంతో వెంకన్న భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు బాధితుడు నర్సంపేట ఏసీపీకి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో నిందితులపై చర్యలు తీసుకోవాలని, తనపై ఒత్తిడి తెస్తున్న ఎస్సైపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని వేడుకున్నాడు.
ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు భరించలేక వెంకన్న గురువారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

