ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి పాలన సాగిస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. ఈ నెల 22వ తేదీన దామెర మండల కేంద్రంలోని ఏఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం పార్టీ నాయకులతో హన్మకొండలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. పరకాల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, పోలీసు ధర్మారావు, సమన్వయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

