డీటీవోను ఢీకొట్టిన బొగ్గు టిప్పర్
విధులు నిర్వహిస్తుండగానే ఘటన
భూపాలపల్లి జిల్లా చెల్పూర్‌లో దుర్ఘటన
ఇటీవలే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన అధికారి
డీటీవో వెంకన్న మృతిపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
వెంకన్న మృతదేహాన్ని చూసి కలెక్టర్ రాహుల్ శర్మ భావోద్వేగం
సమగ్ర దర్యాప్తు జరిపించాలి : మాజీమంత్రి హరీశ్ రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో/ భూపాలపల్లి/మల్హర్ : వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బొగ్గుటిప్పర్ ఢీకొట్టడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి డీటీవో వెంకన్న మరణించారు. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న సోమవారం చెల్పూరు శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత 15రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాకు వెంకన్న బదిలీపై వచ్చారు. ప్రతిరోజులాగే వాహనాల తనిఖీల్లో నిమగ్నమైన ఆయన.. రహదారి భద్రత కోసం విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ అతన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలియగానే ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీటీవో వీధుల్లో భాగంగా ఓ హార్వెస్టర్‌ను సీజ్ చేయగా కార్యాలయంలోనికి వెళ్తున్న క్రమంలో పక్కనే వాహనాలు తనిఖీ చేస్తున్న డిటివోపైకి బొగ్గు టిప్పర్ దూసుకొచ్చిందన్నారు. తాడిచెర్ల నుంచి కేటిపిపిలోకి వెళ్లే బొగ్గు టిప్పర్ అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వాహనం బ్రేక్ ఫెయిల్ అయిందా, డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా..? అనే కోణంలో పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హాస్పిటల్ కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ముఖ్యమంత్రి, మంత్రి దిగ్బ్రాంతి
డీటీవో వెంకన్న మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సమగ్ర దర్యాప్తు జరిపించాలి : హరీశ్ రావు
భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియాల వ్యవహారాలను పూర్తిస్థాయిలో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాల అక్రమాలకు అడ్డుగా నిలిచిన వారిని లారీలతో తొక్కించి చంపేస్తారా? అంటూ హరీశ్ రావు ఘాటుగా ప్రశ్నించారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి హృదయ విదారక ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కలెక్టర్ రాహుల్ శర్మ భావోద్వేగం
ఆర్టీవో వెంకన్న లారీ ప్రమాదంలో మరణించిన వెంకన్న పార్థివ దేహాన్ని దర్శించిన కలెక్టర్ రాహుల్ శర్మ భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణ బదిలీలలో భాగంగా జగిత్యాల జిల్లా నుంచి ఇటీవల భూపాలపల్లికి వచ్చిన వెంకన్న, అంకితభావంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారని కొనియాడారు.ఆసుపత్రిలో ఉన్న వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన వెంకన్న, 2012లో రవాణా శాఖలో ఏఎంవీఐగా ఉద్యోగం సాధించారని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వెంకన్నకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
అనంతరం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో ఆర్టీవో వెంకన్న సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్ఓ వసంత కుమారి, ఆర్‌డీఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొని వెంకన్నకు ఘన నివాళులర్పించారు.

