ఇసుక దోపిడీపై సీబీఐ విచారణ చేపట్టాలి
కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు సీతక్కకు లేదు
రూ.4,000 కోట్ల ఇసుక అక్రమాలను బయటపెట్టాలి
అవినీతి ఆరోపణలపై ములుగు నడిబొడ్డున బహిరంగ చర్చకు రావాలి
బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న రూ.4,000 కోట్ల ఇసుక అక్రమ దోపిడీ, మేడారం జాతర పనుల అవినీతిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు మంత్రి సీతక్కకు లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేడారం జాతర అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని, ఈ విషయంలో అధికార పార్టీ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు నడిచి, ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకున్న ఘటనలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు. దొంగ సర్టిఫికెట్లతో రాజకీయాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నాయకులు నేడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
దృష్టి మళ్లించే కుట్ర
ములుగు జిల్లాలో జరుగుతున్న ఇసుక దోపిడీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, వేల కోట్ల రూపాయల అక్రమ ఇసుక వ్యాపారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని నాగజ్యోతి డిమాండ్ చేశారు. కేటీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేయించడం ద్వారా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మేడారం పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతూ పట్టుబడిన వారు అధికార పార్టీకి చెందినవారే కాదా అని ప్రశ్నించారు. గిరిజనుల సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చి, కొందరు నాయకులు మరియు వారి అనుచరులు మాత్రమే లబ్ధి పొందుతూ గిరిజన సంఘాల సభ్యులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని భావిస్తే, మంత్రి సీతక్క ములుగు నడిబొడ్డున బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ములుగు మండల పార్టీ మాజీ అధ్యక్షులు సనికొమ్ము రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు వేములపల్లి బిక్షపతి, మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అకుతోట చంద్రమౌళి, మున్సిపల్ కౌన్సిలర్లు బైకని అనూష సాగర్, కోగిల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

