ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థుల బాసట
మళ్లీ విద్యాజ్యోతిని వెలిగించేందుకు సన్నద్ధం
కాకతీయ, మలహర్: మండల కేంద్రమైన తాడిచర్ల వెల్మలపల్లిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాల మళ్లీ కళకళలాడనుంది. ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఈ పాఠశాల, విద్యార్థుల కొరత కారణంగా కొన్ని ఏళ్ల క్రితం మూతపడింది. సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరిన ఈ బడికి, అక్కడ చదివి స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఇప్పుడు ఆశాకిరణంగా మారారు. తమ బాల్య జ్ఞాపకాలకు నిలయమైన పాఠశాలను మళ్లీ విద్యార్థుల కేరింతలతో నింపాలని భావించిన పూర్వ విద్యార్థులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. పాఠశాల పునఃప్రారంభానికి అనువుగా వాతావరణాన్ని సిద్ధం చేయడమే కాకుండా, గ్రామస్థుల్లో విద్యపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
గ్రామాభివృద్ధికి విద్యే పునాది అని నమ్ముతున్న ఈ పూర్వ విద్యార్థుల ప్రయత్నం, స్థానికుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. పాఠశాల మళ్లీ ప్రారంభమై, పేద విద్యార్థులకు విద్యాబోధన సాగాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు స్పందించి, పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

