బస్ స్టేషన్ పనులను వేగవంతం చేయాలి
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ. 75 కోట్లతో అత్యాధునిక నిర్మాణం
కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ నగర ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ. 75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన బస్ స్టాండ్ నిర్మాణ పనులను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ స్థలాన్ని సందర్శించి కుడా అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందితో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాత బస్ స్టాండ్ స్థానంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో అత్యాధునిక కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నామని, గత కొంతకాలంగా మందకొడిగా సాగిన పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బస్ బేలు, వెయిటింగ్ హాళ్లు మరియు ఇతర ప్రయాణికుల సౌకర్యాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలను, అధికారులను ఆదేశించారు. వరంగల్‌ను ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు మెరుగైన రవాణా వ్యవస్థ కీలకమని పేర్కొన్న ఇనగాల, కుడా ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

