రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
ములుగు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్
హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేత
సివిల్ సప్లైస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ ఆదేశాలిచ్చిన మంత్రి
అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం
బాయిల్డ్ బియ్యం సరఫరాకు అనుమతివ్వాలని డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలోని రైస్ మిల్లర్లు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని రైస్ మిల్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ కోరారు. ఈ మేరకు శనివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌కు చేరుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ ఆమెకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. మిల్లర్ల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క.. అక్కడికక్కడే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్ల సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి, వెంటనే తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఆరుబయటే ధాన్యం నిల్వలు.. క్వాలిటీ దెబ్బతినే ప్రమాదం
ఈ సందర్భంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో గత 2024-25 రబీ సీజన్‌లో 78,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ (ప్రొక్యూర్మెంట్) జరిగిందని గుర్తుచేశారు. అయితే ఈసారి జిల్లాలో అనూహ్యంగా దిగుబడి పెరిగి, రికార్డు స్థాయిలో 1,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చిన ధాన్యానికి సరిపడా గోదాముల వసతి ములుగు జిల్లాలో లేకపోవడం వల్ల, ప్రత్యామ్నాయం లేక ఆరుబయట ఓపెన్ స్పేస్‌లోనే నిల్వ చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ఈ ధాన్యం నాణ్యత (క్వాలిటీ) దెబ్బతిందని, దీనివల్ల ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారం ముడి బియ్యం (రా రైస్) పాస్ కావడం కష్టతరంగా మారుతుందని వివరించారు.
బాయిల్డ్ బియ్యానికి పర్మిషన్ ఇవ్వాలి
సివిల్ సప్లైస్ అధికారులు వెంటనే స్పందించి, వర్షానికి తడిసి రంగు మారిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అందించేందుకు వీలుగా.. జిల్లాకు ప్రత్యేకంగా ‘బాయిల్డ్ బియ్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద అప్పగించేందుకు అనుమతులు ఇప్పించాలని ప్రవీణ్ కోరారు. తమ సమస్యను వినగానే స్పందించి, ఉన్నతాధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్కకు ములుగు జిల్లా రైస్ మిల్లర్ల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సహోదరు రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, గౌరవ అధ్యక్షులు పల్లెపాటి సంగిరెడ్డి, గౌరవ సలహాదారులు రాణి శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితర ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

