‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దుతాం
2027 డిసెంబర్ నాటికి వంద శాతం సీసీ రోడ్లు
15 నుంచి 20 రోజుల్లో పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
మున్సిపల్ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
కాకతీయ, పరకాల : ప్రత్యేక కార్యాచరణ ద్వారా రాబోయే 15 నుంచి 20 రోజుల్లో పరకాల పట్టణాన్ని ‘క్లీన్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శనివారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పురపాలక సంఘం అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఎదురవుతున్న పారిశుద్ధ్య లోపాలు, సిబ్బంది కొరత, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా తదితర అంశాలను సభ దృష్టికి తెచ్చారు. సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
2027 డిసెంబర్ నాటికి మౌలిక వసతుల పూర్తి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2027 డిసెంబర్ నాటికి పరకాల పట్టణంలోని అన్ని వార్డుల్లో వంద శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని ప్రకటించారు. పట్టణంలోని స్లమ్ (నలిగిపోయిన) ప్రాంతాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ‘జీ ప్లస్-2’ విధానంలో ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, ఇందుకు కౌన్సిలర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు. వర్షాకాలంలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, అవసరమైన చోట్ల కొత్త డ్రైనేజీల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ పన్నుల వసూళ్లను 90 శాతానికి పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను అధికంగా పొందే అవకాశం ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మార్కెట్, బస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
బయోమెట్రిక్ తప్పనిసరి.. సోలార్ పవర్‌కు ఆమోదం
మున్సిపల్ సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి, హాజరును పర్యవేక్షించడానికి రెండు కొత్త బయోమెట్రిక్ యంత్రాలను వెంటనే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా బయోమెట్రిక్ ద్వారానే హాజరు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం రూ. 4.68 లక్షల వ్యయానికి కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. అలాగే పట్టణంలో చెత్త సేకరణ కోసం మూడు కొత్త స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు, మున్సిపల్ కార్యాలయంపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలకు సభ ఆమోదం తెలిపింది. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్లు లేని గృహాలకు వెంటనే నంబర్లు కేటాయించేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ.. ప్రతి వార్డులో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు నిరంతరాయంగా సాగాలని, కొత్తగా కొనుగోలు చేసే స్వచ్ఛ ఆటోలకు ‘జీపీఎస్ ట్రాకింగ్’ వ్యవస్థను అనుసంధానం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా మరణించినా లేదా అనారోగ్య కారణాలతో విధులకు రాలేకపోయినా, వారి కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగ అవకాశం కల్పించే మానవీయ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఎస్సీ కాలనీల్లో ఇంటి నంబర్ల సమస్యను రెవెన్యూ, మున్సిపల్ శాఖలు క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలించి పరిష్కరించాలని తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ పవన్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి, ఏసీపీ సతీష్ బాబు, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

