కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలి
విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర మంత్రి అసమర్థతే కారణం
లక్షలాది మంది భవిష్యత్‌తో ఆటలాడుకున్న కేంద్ర మంత్రి
నితిన్ నబీ పర్యటనను శాంతియుతంగా అడ్డుకుంటాం
డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి
కాకతీయ, హన్మకొండ : దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి అసమర్థతతోనే నీట్‌లాంటి పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో కేంద్రమంత్రి ఆటలాడుకున్నారని అన్నారు. విద్యా వ్యవస్థపై అవగాహన రాహిత్యం, ఏటీఎస్ విధులపై మంత్రి కనీస అవగాహన, బాధ్యత లేకపోవడంతోనే నీట్ పరీక్ష పేపర్లకు లీకుకుప్రధాన కారణమని ఆరోపించారు. ఫలితంగా నీట్ పరీక్ష రాసినా రీ ఎగ్జామ్‌లో తమకు మంచి ర్యాంకు రాదేమోనని ఆందోళన చెందినా ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమయ్యారని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి అసమర్థతను ఒప్పుకోని స్థితిలో మోదీ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని, అసమర్థ మంత్రిని ఇంకా కొనసాగించడమంటే కేంద్ర ప్రభుత్వం దగాకోరు తనానికి నిదర్శమని అన్నారు. ఈ దేశ యువత భవిష్యత్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేదని తెలిపే ఘటన ఇదని మండిపడ్డారు.
నితిన్ నబీ పర్యటనను అడ్డుకుంటాం
ఈనెల 29న వరంగల్ జిల్లాలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీని కాంగ్రెస్ ఎన్ ఎస్ యూఐ, హన్మకొండ డీసీసీ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టిన పాలకులకు పర్యటించే నైతిక హక్కు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ప్రజాభిప్రాయాలను, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నితిన్ నబీని కలిసి వినతిపత్రం అందజేసేందుకు తాము ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని తెలిపారు. కేంద్రం తక్షణమే స్పందించి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విద్యార్థులు, యువతతో కలిసి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

