ఎంజీఎంలో ‘వైద్య’ వికారం..
రోజుకు 50 స్కానింగ్లే.. మిగతా రోగులకు చుక్కలే!
ఎక్స్రే రిపోర్టుల్లో పొంతన లేని ఫలితాలు
ఆపరేషన్ అవసరమన్న వైద్యులు.. థియేటర్ వద్దకు వెళ్లాక వద్దంటూ వెనక్కి!
పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణ
ట్రైనీ నర్సుల బాధ్యతారహితం.. ఎక్కడ పడితే అక్కడ మాస్కుల పారవేత
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పేరుకు పెద్దాస్పత్రే కానీ అక్కడ అందుతున్న సేవలు మాత్రం రోగులకు శాపంగా మారుతున్నాయి. ఓపీ రోగులకు స్కానింగ్ చేయాలన్నా, రిపోర్టులు అందుకోవాలన్నా పేషెంట్లు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఆస్పత్రి ఆవరణ నుంచి ఆపరేషన్ థియేటర్ వరకు అంతా గందరగోళమే! ఎంజీఎంలో రోగ నిర్ధారణ పరీక్షలు ఆశామాత్రంగా సాగుతున్నాయి. ఓపీ రోగులకు రోజుకు కేవలం 50 మందికి మాత్రమే స్కానింగ్ చేయాలనే ‘అలిఖిత’ నియమం అమలవుతోంది. ఆ సంఖ్య దాటితే రోగులు ఎమర్జెన్సీ వార్డులోని స్కానింగ్ గదికి పరుగులు తీయాల్సిందే. అక్కడ కూడా అదే డాక్టర్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం రోగులకు నరకప్రాయంగా మారింది. టెస్టుల రిపోర్టుల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. రిపోర్టులు నేరుగా డాక్టర్ల ఫోన్లకు పంపడం వల్ల, బిజీలో ఉండే వైద్యులు పొరపాటుగా రిపోర్టులను పరిశీలించి తప్పుడు నిర్ధారణలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక రోడ్డు ప్రమాద బాధితుడికి రెండుసార్లు ఎక్స్రే తీసి ఆపరేషన్ తప్పనిసరి అని చెప్పిన వైద్యులు, 15 రోజుల పాటు ఆపరేషన్ థియేటర్ చుట్టూ తిప్పించి, చివరి నిమిషంలో “ఆపరేషన్ అవసరం లేదు” అని చెప్పడం ఆస్పత్రిలోని వైద్య ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తోంది.
అధ్వానంగా ఆవరణ.. అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్!
ఆస్పత్రి ఆవరణను చూస్తే అది పెద్దాస్పత్రా? లేక చెత్త కుండీనా? అనే సందేహం కలగక మానదు. పిచ్చిమొక్కలు, ఎండిపోయిన ఆకులు, పేరుకుపోయిన వ్యర్థాలతో ఆస్పత్రి పరిసరాలు అసహ్యం కలిగిస్తున్నాయి. ట్రైనీ నర్సులు కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో శిక్షణ పొందే నర్సులు, ధరించిన మాస్కులను దారి పొడవునా పారేస్తున్నారు. కనీసం డస్ట్ బిన్లో వేయాలనే కనీస జ్ఞానం కూడా లేకుండా, పారిశుధ్యంపై ఎటువంటి అవగాహన లేకుండా ట్రైనీ నర్సులు ప్రవర్తిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.

వార్డుల్లోనూ అదే దయనీయ స్థితి!
ఆర్థోపెడిక్ వార్డు వెనుక భాగం నుంచి ఆస్పత్రిలోని వివిధ వార్డుల వరకు అపరిశుభ్రత తాండవిస్తోంది. మరుగుదొడ్ల తలుపులు విరిగిపోవడం, గోడల రంగులు వెలిసిపోయి చూడటానికి అసహ్యంగా ఉండటం, వార్డుల్లో వాడి పడేసిన గ్లౌసులు ఎక్కడ పడితే అక్కడ దర్శనమివ్వడం ఇక్కడి పారిశుధ్య నిర్వహణకు అద్దం పడుతోంది. మండల స్థాయి పీహెచ్సీలే శుభ్రతపై ఇంత ప్రచారం చేస్తుంటే, రాష్ట్రంలోనే కీలకమైన ఎంజీఎంలో మాత్రం ఈ దుస్థితి ఏమిటని రోగుల అటెండెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి, ఇప్పటికైనా ఎంజీఎంను బాగు చేయకపోతే.. ఇక రోగుల పాలిట ఆ ఆస్పత్రి ఒక పీడకలగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.


