కాళేశ్వరం కాదు..నిధుల ఎత్తిపోతల పథకం
మేడిగడ్డలో నీటి నిల్వ అత్యంత ప్రమాదకరం
కేంద్ర నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు
బీఆర్ఎస్ నాయకత్వంపై మంత్రి సీతక్క విమర్శలు
కాకతీయ,ములుగు ప్రతినిధి : మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ నీటిని నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టంగా సూచించిందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిపుణుల సలహాలను పాటించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, రాజకీయ నాయకుల వ్యాఖ్యల ఆధారంగా నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయవద్దని, కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల చేపట్టవద్దని కేంద్ర నిపుణుల బృందం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తోందని ఆమె వెల్లడించారు.
అవినీతికి ప్రతీక కాళేశ్వరం
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అద్భుతమని ప్రచారం చేసుకున్నా, నేడు అది అవినీతికి ప్రతీకగా మారిందని మంత్రి సీతక్క విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నాణ్యత లేని పనులు చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని, మోటార్లు మునిగిపోయాయని ఆరోపించారు. నాలుగు రాళ్లతో బ్యారేజీని నిలబెట్టవచ్చని కేసీఆర్, పంప్ హౌస్ నడపవచ్చని కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు వారి గందరగోళానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. నాలుగు రాళ్లతో సమస్య తీరేదైతే, వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశారని ఆమె ప్రశ్నించారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, కమిషన్ల కోసం డిజైన్లు మార్చి నిర్మించిన నిధుల ఎత్తిపోతల పథకమని మంత్రి మండిపడ్డారు.
రాజకీయాల కోసం ప్రాణాలతో చెలగాటం
కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం ప్రకటిత నిపుణుల మాటలు కాకుండా, దేశంలోని అత్యున్నత సాంకేతిక సంస్థల సూచనల మేరకే ముందుకు సాగుతోందని సీతక్క స్పష్టం చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ లేకపోతే వ్యవసాయం ఆగిపోతుందని బీఆర్ఎస్ చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీరు ఎత్తిపోయకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సాగు జరిగిందని గుర్తు చేశారు. కేటీఆర్‌కు నిజంగా నమ్మకం ఉంటే ఢిల్లీ వెళ్లి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులను ఒప్పించాలని సవాల్ విసిరారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు గొప్పవి కావని, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, బ్యారేజీని శాశ్వతంగా ఎలా పునరుద్ధరించాలో నిపుణులతో చర్చిస్తున్నామని ఆమె వివరించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన తర్వాత కూడా రెండు నెలల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రజల డబ్బును, ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆమె పునరుద్ఘాటించారు.

