- రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల తగ్గింపును విరమించాలి
- టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత
కాకతీయ, నెల్లికుదురు: పాఠశాలల విలీనం, రేషనలైజేషన్ పేరుతో వేల సంఖ్యలో పాఠశాలలను మూసివేయడం విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటిదని, ఇది పూర్తిగా తిరోగమన చర్య అని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత విమర్శించారు. నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాఠశాలల్లో సమస్యల సేకరణ’ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఉన్న 27 వేల పాఠశాలలను కేవలం 4 వేలకు కుదించాలన్న ప్రభుత్వ నిర్ణయం అశాస్త్రీయమైనది. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు తమ సర్వీస్ కాలంలో ఒక్క పదోన్నతి కూడా పొందకుండానే పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయ పోస్టును మంజూరు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాలుగా హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం దాటవేస్తోందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బలాస్టి రమేష్, జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్, మండల అధ్యక్షులు యాకయ్య, కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్, కరుణాకర్, మధు తదితరులు పాల్గొన్నారు.

