సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
హన్మకొండ డీసీసీ భవన్లో కాంగ్రెస్ నేతల సంబరాలు
కాకతీయ, హనుమకొండ: వరంగల్ (మామునూరు) విమానాశ్రయ సాధనలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఆధ్వర్యంలో బుధవారం పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వీరు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కార్యకర్తలు బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ, మామునూరు విమానాశ్రయం మరియు వరంగల్ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి సీఎం ప్రత్యేక చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వరంగల్ ప్రజల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

