కన్నవారిని పట్టించుకోకుంటే చర్యలు తప్పవు
వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని అమలు చేస్తాం
తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుల జోక్యం నిషిద్ధం : ఆర్డీవో కే.కృష్ణవేణి
కాకతీయ, ములుగు ప్రతినిధి: వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 ప్రకారం కన్నవారిని పట్టించుకోని కుమారులపై కఠిన చర్యలు తప్పవని తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ సంక్షేమ ట్రిబ్యునల్ అధికారి, ఆర్డీవో కే.కృష్ణవేణి స్పష్టం చేశారు. ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన గాదె నక్షత్రారెడ్డి, జేసింతమ్మలు తమ కుమారులు గాదె అశోక్ రెడ్డి, గాదె అబ్రహం రెడ్డిలు తమను ఆదరించడం లేదని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. తల్లిదండ్రులు తాము సంపాదించిన ఆరు గుంటల స్థలాన్ని ఇద్దరు కుమారులకు సమానంగా పంచినప్పటికీ, వారు తమను పట్టించుకోవడం లేదని బాధితులు పేర్కొన్నారు.
చట్టప్రకారం కేసు నమోదు చేస్తాం
ఫిర్యాదు మేరకు చట్టం సెక్షన్ 5 (1) ప్రకారం కుమారులకు నోటీసులు జారీ చేసి, గత నెల 30న విచారణ చేపట్టగా తల్లిదండ్రులను వారు నిర్లక్ష్యం చేస్తున్నట్లు ధ్రువీకరణ జరిగిందని ఆర్డీవో వివరించారు. దీనితో 2007 చట్టం సెక్షన్ 9 (1) మరియు సెక్షన్ 4 ప్రకారం తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి విషయంలో కుమారులు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోకూడదని ఆమె హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినమైన కేసు నమోదు చేయబడుతుందని కే.కృష్ణవేణి స్పష్టం చేశారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించి, వారి సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె పేర్కొన్నారు.

