క్యాష్ కొట్టు..కుర్చీ పట్టు..!
అమ్మకానికి పీఏసీఎస్ పదవులు
ఆర్థిక అర్హతతతోనే పదవుల అప్పగింతకు రంగం సిద్ధం
పదేళ్లు కష్టపడ్డమని చెబుతున్నా.. నీతో కాదంటూ ముఖ్య నేతల తిరస్కరణ
ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియామకాలు?
అధికార పార్టీలో కష్టపడ్డ నాయకులకు అన్యాయం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి
క్షేత్రస్థాయి కార్యకర్తల్లో పెరుగుతున్న ఆందోళన
కాకతీయ,వరంగల్ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నామినేటెడ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో తీవ్ర చిచ్చు రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నియామకాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలను కాదని, కేవలం ఆర్థికంగా బలంగా ఉన్న వారికి, ఎమ్మెల్యేల సిఫార్సు ఉన్న వారికే ప్రాధాన్యం దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఈ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ నియామకాల్లో భారీగా డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని, క్షేత్రస్థాయిలో కష్టపడిన నాయకులను సైతం “నీతో కాదంటే నీతో కాదు” అని పక్కనపెడుతూ, ఆర్థిక అర్హత ఉన్న వారికే పదవులను అప్పగించేలా రంగం సిద్ధం చేయడంపై సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందనే ఆవేదన జిల్లావ్యాప్తంగా వినిపిస్తోంది.

గీసుగొండ నుంచి ఆత్మకూర్ వరకు..
గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని ఊకల్ పీఏసీఎస్ చైర్మన్ పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. ఈ సంఘం కోసం భూములిచ్చిన నిర్వాసిత కుటుంబాలకు, గతంలో సహకార సంఘంలో పనిచేసి రైతు సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అయితే, పార్టీ పెద్దల నిర్ణయం అందుకు భిన్నంగా ఉండటంతో కార్యకర్తల్లో అయోమయం మొదలైంది. మరోవైపు, హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలంలో పీఏసీఎస్ చైర్మన్ పదవి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. స్థానిక నాయకులను పక్కనపెట్టి, ఎమ్మెల్యే తమకు అనుకూలమైన వారికి పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు భవిష్యత్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతాయని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
నియామకాల్లో పారదర్శకత ఎక్కడ?
ఇటీవలి కాలంలో పీఏసీఎస్ పదవులను భవిష్యత్ రాజకీయాలకు సోపానాలుగా భావిస్తుండటంతో పోటీ తీవ్రమైంది. రాజకీయ సిఫార్సులు, వర్గపోరాటాలకు అతీతంగా నిజాయితీపరులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. విద్యావంతుడైన యువ నాయకుడికి అవకాశం కల్పిస్తేనే, రైతు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించి సహకార వ్యవస్థలో పారదర్శకతను తీసుకురాగలరని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లో సాగుతున్న ఈ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, ఎవరికి పదవులు దక్కుతాయో, ఎవరికి నిరాశ ఎదురవుతుందోనన్న ఉత్కంఠ జిల్లా రాజకీయాల్లో నెలకొంది. రాజకీయ లబ్ధి కోసం పార్టీని నమ్ముకున్న వారిని బలి చేయొద్దని కార్యకర్తలు అధిష్టానాన్ని వేడుకుంటున్నారు.

