అర్ధరాత్రి కిరాతకం.. నిద్రిస్తున్న వ్యక్తి గొంతు కోసి హత్య
వాజేడు మండలం దుబ్బగూడెంలో ఘటన
పాత కక్షలతోనే హత్య… ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా వాజేడు మండలం దుబ్బగూడెంలో చోటుచేసుకున్న దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన మడే చలపతి (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో వేట కొడవలితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తెల్లవారుజామున ఈ దారుణం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, హత్య జరిగిన తీరుపై ప్రాథమిక ఆధారాలను సేకరించారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చలపతికి ఎవరితోనైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా లేదా పాత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించగా, క్లూస్ టీమ్‌తో పాటు డాగ్ స్క్వాడ్‌ను రప్పించి శాస్త్రీయ ఆధారాలను సేకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

