- సీపీ చిత్రపటానికి పాలాభిషేకం
- నెక్కొండలో చర్చనీయాంశంగా ఎస్‌ఐ మహేందర్ సస్పెన్షన్
కాకతీయ, నెక్కొండ : నెక్కొండ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి ఉత్తర్వులు జారీ చేయడంతో నెక్కొండ మండల కేంద్రంలో కొందరు ప్రజలు సంబరాలు నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సీపీ శ్వేతారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఐ మహేందర్‌పై వచ్చిన వివిధ అవినీతి ఆరోపణల నేపథ్యంలో శాఖాపరంగా నిర్వహించిన విచారణలో ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు గుర్తించడంతో ఈ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన పలువురు స్థానికులు, కొంతకాలంగా ఎస్‌ఐ వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని పేర్కొన్నారు.
ఆరోపణలు మరియు నిరసనలు
విధుల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి పాటించకుండా కొందరికి అనుకూలంగా వ్యవహరించడం, అమాయకులపై రౌడీషీట్లు నమోదు చేసి వేధించడం వంటి తీవ్ర ఆరోపణలు వినిపించాయని స్థానికులు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులనే సూత్రాన్ని పోలీసులు పాటించాలని, రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా విధులు నిర్వర్తించి ప్రతి పౌరుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అవినీతి ఆరోపణలపై స్పందించి సస్పెన్షన్ వేటు వేసిన పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డికి నెక్కొండ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, ఎస్‌ఐ సస్పెన్షన్ అంశం ప్రస్తుతం నెక్కొండ మండలంలో హాట్ టాపిక్‌గా మారింది.

