పారిశుద్ధ్యం గాలికి.. ప్రజల ఆరోగ్యం ప్రశ్నార్థకం
రాయపర్తికి చెత్తకుప్పలే స్వాగతం
ఫాగింగ్ లేదు.. బ్లీచింగ్ పౌడర్ జాడలేదు
వర్షాకాలంలోనూ నిద్రలోనే పంచాయతీ యంత్రాంగం
కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రభుత్వం పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై గ్రామంలోకి ప్రవేశించే మార్గాల వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి. రహదారి పక్కనే కొబ్బరి బొండాల వ్యర్థాలు, ప్లాస్టిక్ సంచులు, కుళ్లిన చెత్తను బహిరంగంగా పారబోస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు, చెత్త సేకరణ వాహనాలు, నిర్వహణ నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటి వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాల్సిన వాహనాలు సక్రమంగా తిరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు రోడ్ల పక్కనే చెత్తను పారబోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

రోగాల భయంతో గ్రామస్తులు
రోడ్లపై పేరుకుపోయిన చెత్త, మురుగుకాలువల్లో నిల్వ నీరు, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా దోమలు విపరీతంగా పెరిగాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి చర్యలు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. స్థానిక నివాసి పీరని రాజు మాట్లాడుతూ గ్రామంలోని కాలువలు వ్యర్థాలతో నిండిపోవడంతో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోందన్నారు. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా తిరగడం లేదని, పారిశుద్ధ్య చర్యలు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లే పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

