శిలాఫలకాలకే పరిమితమైన అభివృద్ధి
గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి విమర్శలు
వరంగల్ 15, 16, 17 డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కట్టమల్లన్న ఆలయానికి మెరుగైన సౌకర్యాల కల్పనకు హామీ
కాకతీయ, గీసుగొండ : గత ప్రభుత్వంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ మహానగర పాలక సంస్థ 15, 16, 17 డివిజన్లలో శ్రీ కట్టమల్లన్న ఆలయ అభివృద్ధి పనులతో పాటు దూపకుంటలో మహిళా కమ్యూనిటీ భవనం, గాడిపెల్లిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మాజీ మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కట్టమల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని, ప్రజలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించాలని కోరారు. రైతు రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్, సన్న బియ్యం పంపిణీ, హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

