శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ఏటూరునాగారం మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ హృదయ కలశం ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన సన్నిధి నుంచి కలశాన్ని ఏటూరునాగారానికి తీసుకొచ్చినట్లు రామాలయ కమిటీ చైర్మన్ అలువాల శ్రీనివాస్ తెలిపారు. భక్తులు కలశాన్ని తాకి నమస్కరించుకునే అవకాశం కల్పించారు. అనంతరం ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించగా భక్తులు ‘జై శ్రీరామ్’ నినాదాలతో భజనలు చేశారు. లోకకల్యాణం, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమం నిర్వహించినట్లు శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కత్తెర శ్రీనివాస్, దీనబాంధవస్వామి, అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ, పర్వతాల ప్రవీణ్, జూపాక పవన్ తదితరులు పాల్గొన్నారు.

