ఎస్‌టీపీని వెంటనే పునరుద్ధరించాలి
300 కేఎల్‌డీ ప్లాంట్ చాలాకాలంగా నిరుపయోగం
టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి
నగరంలో ప్రతి వీధిలో అవెన్యూ ప్లాంటేషన్
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
బాలసముద్రం ఎస్‌టీపీని పరిశీలించిన కమిషనర్
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : నగర పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. బాలసముద్రంలోని 300 కేఎల్‌డీ సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, స్థానిక ప్రజల అవసరాల దృష్ట్యా ప్లాంట్‌ను వెంటనే పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బాలసముద్రం రెండు పడకల గదుల సముదాయంలో ఉన్న ఈ ప్లాంట్ చాలాకాలంగా పనిచేయడం లేదని అధికారులు కమిషనర్‌కు వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ అవసరమైన టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణలో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పాత్ర కీలకమని, వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
పచ్చదనంపై ప్రత్యేక దృష్టి
అనంతరం 59వ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో నిర్వహించిన అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. స్థానిక కాలనీ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు ప్రతి వీధిలోనూ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. మొక్కల సంరక్షణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజ్‌కుమార్, ఇన్‌చార్జి హార్టికల్చర్ అధికారి లక్ష్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పందన తదితర అధికారులు పాల్గొన్నారు.

