ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఉండాలి
సమగ్ర భూగర్భ డ్రైనేజీకి 14వ డివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి
62 ఇంజినీరింగ్ పనులు మంజూరు.. 39 పూర్తి
తాగునీరు, శానిటేషన్, వీధి దీపాల సమస్యలకు త్వరలో పరిష్కారం
14వ డివిజన్ సమస్యలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కమిషనర్ టి.వెంకన్న సమీక్ష
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తక్షణమే స్పందించి సమన్వయంతో చర్యలు చేపట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ టి.వెంకన్నతో కలిసి 14వ డివిజన్ సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు శానిటేషన్, తాగునీరు, వీధి దీపాలు, శ్మశానవాటిక, విద్యుత్ తదితర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో సమగ్ర భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీగా నిధులు కేటాయించారని ఎమ్మెల్యే తెలిపారు. అందులో సింహభాగం వర్ధన్నపేట నియోజకవర్గానికి, ముఖ్యంగా 14వ డివిజన్‌కు కేటాయించాలని కోరారు. వర్షాల సమయంలో ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. 14వ డివిజన్లో 62 ఇంజినీరింగ్ పనులు మంజూరు కాగా, 39 పనులు పూర్తయ్యాయని కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. వీధి దీపాలు, శానిటేషన్ వాహనాల డ్రైవర్ల నియామకం, శ్మశానవాటిక సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. 2020-21 సర్వేలో జరిగిన తప్పుల కారణంగా నీటి సరఫరా లేకున్నా కొందరికి బిల్లులు వస్తున్న అంశాన్ని సీడీఎంఏ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఎంహెచ్ఓ డా. రాజేష్, డీఈలు, ఏఈలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

