ఫోటోగ్రాఫర్ కుడుతాల రమేష్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీల్లో కన్సోలేషన్ బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం పోటీల్లో గుర్తింపు
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 306 ఛాయాచిత్రాలు
హైదరాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారం ప్రదానం
కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీల్లో వరంగల్‌కు చెందిన మన తెలంగాణ ఫోటోగ్రాఫర్ కుడుతాల రమేష్ కన్సోలేషన్ బహుమతికి ఎంపికయ్యారు. ఫోటోజర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు, ప్రతిభకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు వారిని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం ప్రతి ఏడాది ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 102 ఎంట్రీలు అందగా, 306 ఛాయాచిత్రాలు పోటీలో నిలిచాయి.
నిపుణుల కమిటీ పరిశీలన
వివిధ ప్రాంతాలు, సంఘటనలు, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా ఫోటోజర్నలిస్టులు సమర్పించిన ఛాయాచిత్రాలను నిపుణుల కమిటీ పరిశీలించి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. ఇందులో కుడుతాల రమేష్ సమర్పించిన ఛాయాచిత్రం రాష్ట్ర స్థాయి కన్సోలేషన్ బహుమతికి ఎంపికైంది. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం పట్ల రమేష్‌కు జర్నలిస్టులు, ఫోటోజర్నలిస్టులు, మన తెలంగాణ సిబ్బంది అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు రాష్ట్ర స్థాయి బహుమతిని ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

