రైస్‌మిల్ పరిశ్రమను కాపాడాలి
మిల్లింగ్ చార్జీలు పెంచాలి.. విద్యుత్ టారిఫ్ సవరించాలి
జిల్లాకు అవసరమైన గోదాములు నిర్మించాలి
సీఎం రేవంత్ రెడ్డికి బాదం ప్రవీణ్ వినతి
కాకతీయ, ములుగు ప్రతినిధి : తెలంగాణలో రైస్‌మిల్ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ కోరారు. ఆదివారం ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి అసోసియేషన్ సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం డెలివరీ వరకు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ధాన్యం మిల్లుల్లో 60 రోజులకు పైగా నిల్వ ఉండటంతో వెయిట్ లాస్, డ్యామేజ్, రంగు మారడం వల్ల క్వింటాకు రూ.600 నుంచి రూ.750 వరకు నష్టం వస్తోందన్నారు. స్టార్చ్ మిషన్ల వినియోగంతో అదనంగా 60 హెచ్‌పీ విద్యుత్ అవసరమవుతోందని తెలిపారు. మిల్లింగ్ చార్జీలను పెంచాలని, 124 నుంచి 199 హెచ్‌పీ వరకు ఎల్‌టీ కేటగిరీలో కొనసాగించేలా విద్యుత్ టారిఫ్‌ను సవరించాలని కోరారు. పాత గన్నీ సంచుల భారం తగ్గించాలని, ప్రతి జిల్లాకు అవసరమైన సామర్థ్యంతో గోదాములు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యంతో ఉత్పత్తయ్యే బియ్యాన్ని థర్డ్ పార్టీలకు విక్రయించే అవకాశం కల్పించేలా నిబంధనలు మార్చాలని కోరారు. రైస్‌మిల్ పరిశ్రమను కాపాడేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకోవాలని బాదం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.

