అనధికారిక ఫ్లెక్సీలపై బల్దియా ఉక్కుపాదం
అనుమతి లేకుండా ముద్రించినా క్రిమినల్ కేసులు
ఫ్లెక్సీ తయారీదారులకు కమిషనర్ హెచ్చరిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నగర సుందరీకరణకు విఘాతం కలిగిస్తున్న అనధికారిక కమర్షియల్ ఫ్లెక్సీలపై బల్దియా కఠిన చర్యలకు సిద్ధమైంది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ముద్రించినా, ఏర్పాటు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫ్లెక్సీ తయారీదారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాలు, జంక్షన్లు, మీడియన్లు, డివైడర్లు, టెలిఫోన్, విద్యుత్ స్తంభాలు, చెట్లపై కమర్షియల్ ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే బల్దియా నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అనుమతించిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫ్లెక్సీ తయారీదారులకు నిబంధనల కాపీలను అందజేస్తామని, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనధికారిక ఫ్లెక్సీల నియంత్రణకు పోలీసు శాఖ సహకారం తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మునిసిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్‌లింగం, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డీసీలు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎస్‌ఎఫ్‌ఓ రాజేశ్వర్‌రావు, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

