దొంతి మాధవరెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు
నియోజకవర్గమంతా పెద్ది విగ్రహాలు పెడతాం
రానున్న ఎన్నికల్లో దొంతి ఓటమి ఖాయం
సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే నన్నపునేని ఫైర్
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గృహనిర్బంధంలో ఉన్న తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరణించిన వ్యక్తిపై కక్ష సాధించడం సరికాదని నరేందర్ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అనుమతి ఇచ్చి, తెలంగాణ కోసం పోరాడిన పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. పెద్ది అంత్యక్రియల అనంతరం ఆయన కుటుంబంపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఒక విగ్రహం తొలగిస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని నరేందర్ తెలిపారు. అప్పుడు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సంపేట ప్రజలు ఇప్పటికే రోడ్డెక్కారని, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఓటమి తప్పదని అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని, ప్రజల మనోభావాలను గౌరవించకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

