ఇష్టపడి కష్టపడితేనే విద్యార్థులకు విజయం
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ స్నేహ శబరిష్
గురుకుల బాలికల పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కాకతీయ, ఇనుగుర్తి: ఇష్టపడి కష్టపడితేనే చదువులో విజయం సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటారని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, డైనింగ్ హాల్, వంటశాల, వసతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం సమయానికి నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. తాగునీటి ప్లాంట్, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి ఆహార నాణ్యత, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి శేరీష, ప్రిన్సిపాల్ జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

