నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు
శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శం
మత సామరస్యం, పరస్పర గౌరవంతోనే సమాజ అభివృద్ధి
అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్
కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్‌లో జూబ్లీ హోటల్ వద్ద నిర్వహించిన మిలాద్-ఉన్-నబి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రజల మధ్య ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో, సోదరభావంతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యం, పరస్పర గౌరవం, ఐక్యతను మరింత బలోపేతం చేయడం ద్వారా సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

