మూడు దశాబ్దాల తర్వాత… మళ్లీ ఒక్కచోట!
సీకేఎం స్నేహబంధానికి చిరునామాగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
యూకే నుంచి స్నేహం కోసం వచ్చిన సాంబమూర్తి
కాకతీయ, హన్మకొండ : మూడు దశాబ్దాల కాలం.. మారిన జీవితాలు.. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులు.. అయినా చెక్కుచెదరని స్నేహబంధం. వరంగల్‌లోని ప్రముఖ సీకేఎం డిగ్రీ కళాశాలలో 1996లో బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్న పూర్వ విద్యార్థులు మూడు దశాబ్దాల తర్వాత హనుమకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడంతో సమ్మేళనం ఆద్యంతం సందడిగా, ఆప్యాయంగా సాగింది. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పట్లో చేసిన చిలిపి పనులు, సరదా సంఘటనలు, తరగతి గదిలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటనలను గుర్తుచేసుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు. ఒకప్పుడు కలిసి తిరిగిన స్నేహితులు నేడు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినా తమ మధ్య ఉన్న అనుబంధం మాత్రం మారలేదని ఈ సమ్మేళనం చాటిచెప్పింది.
స్నేహం కోసం.. యూకే నుంచి!
ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థి సాంబమూర్తి యూకే నుంచి ప్రత్యేకంగా రావడం ఆకర్షణగా నిలిచింది. కేవలం స్నేహితులను కలుసుకోవడంతోపాటు మూడు దశాబ్దాల నాటి జ్ఞాపకాలను మళ్లీ పంచుకునేందుకు ఆయన యూకే నుంచి హనుమకొండకు రావడం తోటి మిత్రుల్లో ఆనందం నింపింది. సాంబమూర్తిని స్నేహితులు ఆప్యాయంగా పలకరించి ఆయన రాకపై సంతోషం వ్యక్తం చేశారు. ‘‘కాలం మారినా.. దూరాలు పెరిగినా.. స్నేహం మాత్రం చెరిగిపోదు’’ అన్న మాటలకు ఈ సమ్మేళనం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. విద్యార్థి దశ నుంచి నేటి వరకు సాగిన తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఒకరి యోగక్షేమాలను మరొకరు తెలుసుకున్నారు. పాత మిత్రులంతా కలిసి ఫొటోలు దిగుతూ సరదాగా గడిపి తమ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. మూడు దశాబ్దాల తర్వాత కలిసిన స్నేహితుల ముఖాల్లో కనిపించిన ఆనందం, గతాన్ని గుర్తుచేసుకున్న కళ్లలో మెరిసిన జ్ఞాపకాలు, స్నేహబంధాన్ని మరోసారి సజీవం చేసిన ఆత్మీయ పలకరింపులతో ఈ సమ్మేళనం ఓ మధుర జ్ఞాపకంగా మారింది. పూర్వ విద్యార్థులు సంజయ్, సమ్మయ్య, స్వామి, నారాయణరెడ్డి, సాంబమూర్తి, వెంకట్, శ్రీనివాస్, చంద్రయ్య, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

