సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
గుర్తుతెలియని లింకులు, క్యూఆర్ కోడ్‌లను నమ్మొద్దు
‘బీ సైబర్ స్మార్ట్’ పోస్టర్లు ఆవిష్కరించిన భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
కాకతీయ, భూపాలపల్లి : గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన ‘బీ సైబర్ స్మార్ట్’ అవగాహన పోస్టర్లను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగల సమయంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. గుర్తుతెలియని లింకులు, క్యూఆర్ కోడ్‌లు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. గణేష్ ఉత్సవాలను ఆనందంగా జరుపుకోవడంతోపాటు సైబర్ భద్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, సైబర్ సెక్యూరిటీ ఎస్‌ఐ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐ శివకుమార్, సైబర్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

