నర్సంపేటలో బీఆర్‌ఎస్ సమరభేరి
కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై ధ్వజం
420 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ నర్సంపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి నిర్వహించారు. నర్సంపేట పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ విధానాలను, 1000 రోజుల పాలనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సమరభేరిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. 100 తప్పులతో శిశుపాలుని తల తెగిపడినట్లు.. 1000 రోజుల పాలనతో 420 హామీల కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాలనలోనే తెలంగాణను 30 ఏళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు రాకేష్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, మండల నాయకులు రవీందర్, రమేష్‌యాదవ్, గటిక అజయ్‌కుమార్, ఆకుల శ్రీనివాస్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

