పాలన చేతకాకపోతే గద్దె దిగిపోండి..
పంటలు ఎండిపోతున్నా సర్కార్‌కు పట్టింపులేదు
ఎస్సారెస్పీ కాల్వకు నీరు విడుదల చేయాలి
కేసీఆర్‌కు పేరు వస్తుందనే నీటి విడుదల ఆపుతున్నారు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తాం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్
కాకతీయ, పెద్దవంగర : ఎస్సారెస్పీ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేసి ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోతే గద్దె దిగిపోవాలని మండిపడ్డారు. గురువారం పెద్దవంగర మండల కేంద్రంలోని సబ్ కెనాల్ నుంచి కిష్టు తండా వరకు రైతులతో కలిసి ఎండిపోయిన ఎస్సారెస్పీ పేజ్-2 కాల్వ వెంట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాల్వల ద్వారా చెరువులకు సాగునీరు అందించి కళ్లముందే ఎండిపోతున్న వరి పంటలను కాపాడాలని కోరారు. వర్షాకాలంలో కాల్వకు నీరు వస్తుందన్న ఆశతో రైతులు వరి నాట్లు వేశారని, ఇప్పుడు నీరు అందకపోతే ఎకరాకు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నీరు విడుదల చేయొద్దని ప్రభుత్వం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా, కరెంట్ కష్టాలతో రైతులు ఆగం
యూరియా దొరకక, కరెంట్ సమస్యలతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, పంట రుణమాఫీ సక్రమంగా జరగకపోగా రైతుబీమా విషయంలోనూ ప్రభుత్వం మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పంటలకు నీరు ఇస్తే పంటలు పండుతాయని, అలా జరిగితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే నీటిని విడుదల చేయకుండా రైతుల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని, సాగునీరు అందించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ తులం బంగారం ఇవ్వాలని, లేదంటే మహిళలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

