హమారా ప్రసాద్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి
‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి
సెప్టెంబర్ 18న పుస్తకావిష్కరణను అడ్డుకుంటాం
దళిత బహుజన ప్రజా సంఘాల డిమాండ్
కాకతీయ, హన్మకొండ : డా. బీఆర్ అంబేద్కర్‌ను కించపరుస్తూ ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని ప్రచురిస్తున్న హమారా ప్రసాద్‌పై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాజద్రోహం కేసు నమోదు చేసి తీహార్ జైలుకు పంపాలని దళిత బహుజన ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పుస్తకాన్ని నిషేధించి, విడుదలను అడ్డుకోవాలని కోరాయి. మంగళవారం హనుమకొండలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బండి అశోక్ అధ్యక్షతన నిరసన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల బాధ్యులు మాట్లాడుతూ హమారా ప్రసాద్‌ను బీజేపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లో జరగనున్న పుస్తకావిష్కరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. రిజర్వేషన్ల ఫలాలతో చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంట రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. సుబేదారి సీఐ ఎం. రంజిత్‌కుమార్, ట్రాఫిక్ సీఐ వెంకన్న చర్చించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జోరిక రమేష్, దామెర నర్సయ్య, రౌతు రమేష్, చుంచు రాజేందర్, పెరుమాండ్ల రామకృష్ణ, అరూరి సాంబయ్య, కొండ్ర నర్సింగరావు, కడారి కుమార్, ప్రభాకర్, దండ్రి శ్రీనివాస్, పనికేల శ్రీనివాస్, మంద వీరస్వామి, సాధు కుమారస్వామి, సింగారపు రవిప్రసాద్, మాదాసు సురేష్, పోతుల కొమ్మలు, అంకుస్ రవి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

