ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు..
కాకతీయ, వరంగల్ బ్యూరో : నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పథకం కింద మడిపల్లి రైతు వేదికలో జయగిరి, లక్నవరం, మడిపల్లి గ్రామాలకు చెందిన 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అడ్లూరి అనురాధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి స్థానికంగా లభించే సహజ వనరులతో తక్కువ ఖర్చుతో స్థిరమైన వ్యవసాయం చేపట్టవచ్చన్నారు. ఏడీఏ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. పశువుల ఎరువు, పంట అవశేషాలు, వేప తదితర సహజ వనరులను వినియోగించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంతో నేలలో జీవపదార్థం, సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడి నేల ఆరోగ్యం కాపాడబడుతుందని తెలిపారు. రైతులు దశలవారీగా ప్రకృతి వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో 15 ఏళ్ల అనుభవం ఉన్న రిసోర్స్ పర్సన్ హుస్సేన్ నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, పంచగవ్య, వావిలాకు కషాయం, అగ్నాస్త్రం, వేస్ట్ డీకంపోజర్, దశపర్ణి కషాయం తదితర సహజ ఎరువులు, పురుగుమందుల తయారీ, వినియోగ విధానాలను రైతులకు ప్రదర్శించి వివరించారు. అనంతరం ఎన్‌ఎంఎన్‌ఎఫ్ పథకం కింద ఎంపికైన 125 మంది రైతులకు వ్యవసాయ కిట్లను జిల్లా వ్యవసాయ అధికారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఈఓ సుమన్, మడిపల్లి సర్పంచ్ రంజిత్, జయగిరి సీఆర్‌పీ రమ్య, మడిపల్లి సీఆర్‌పీ రవళి, వ్యవసాయ శాఖ సిబ్బంది, జయగిరి, లక్నవరం, మడిపల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.

