నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు
సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్ దరఖాస్తులు
ఏప్రిల్ 10, 2027న లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్
గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్ల కేటాయింపు
పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం ఇన్చార్జి ప్రిన్సిపాల్ టి. రమేష్
కాకతీయ, వరంగల్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027కు అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం, మామూనూర్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ టి. రమేష్ తెలిపారు. నవోదయ విద్యాలయ సమితి విధానం ప్రకారం బాహ్య సంస్థ నిర్వహించే ఎంపిక పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి అర్హులని టి. రమేష్ తెలిపారు. విద్యార్థి జన్మతేది 01-05-2012 నుంచి 31-07-2014 మధ్య ఉండాలని, రెండు తేదీలను కలుపుకొని పరిగణిస్తామని చెప్పారు. విద్యార్థి ప్రవేశం కోరుతున్న జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదివి విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలని తెలిపారు. 11వ తరగతి ప్రవేశానికి 2026–27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. వారి జన్మతేది 01-06-2010 నుంచి 31-07-2012 మధ్య ఉండాలని, అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి చదివి విద్యా సంవత్సరం పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. 9వ, 11వ తరగతులకు ఎంపిక పరీక్ష 10-04-2027న నిర్వహించనున్నట్లు తెలిపారు.
గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు
నవోదయ విద్యాలయాలు పూర్తిగా ఉచిత విద్య అందించే సహవిద్యా, నివాస పాఠశాలలని టి. రమేష్ తెలిపారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ అనుబంధంతో, ఎన్సీఈఆర్టీ పాఠ్యప్రణాళిక ఆధారంగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉంటుందని చెప్పారు. 9వ తరగతిలో హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి హిందీ మాట్లాడని ప్రాంతాలకు, అలాగే దీనికి విరుద్ధంగా విద్యార్థుల మైగ్రేషన్ విధానం ఉంటుందని వివరించారు.
ప్రవేశాల్లో 75 శాతం సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారని తెలిపారు. విద్యార్థి తన చదువులో ఏదైనా భాగాన్ని పట్టణ ప్రాంతంలో చదివినట్లయితే అర్బన్ అభ్యర్థిగా పరిగణిస్తామని పేర్కొన్నారు. పాఠశాల గ్రామపంచాయతీ పరిధిలో ఉంటే గ్రామీణ ప్రాంతంగా, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఉంటే పట్టణ ప్రాంతంగా పరిగణిస్తారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, బాలికలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపారు.
అధికారిక వెబ్సైట్లో దరఖాస్తులు
అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టి. రమేష్ సూచించారు. 9వ, 11వ తరగతుల ప్రవేశాలకు ప్రత్యేక ఆన్లైన్ దరఖాస్తు లింకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు గడువులోగా దరఖాస్తులు సమర్పించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

