విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి
పేపర్ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి
విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటం
హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి
కాకతీయ, హన్మకొండ : విద్యార్థుల హక్కులు, ఉజ్వల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఉండకుండా ఒక్కతాటిపైకి రావాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఛాత్రోం కీ గూంజ్–విద్యార్థుల గర్జన కార్యక్రమానికి మద్దతుగా శుక్రవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేపర్ లీకేజీలు, అధిక ఫీజులు, సకాలంలో జరగని పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో జాప్యంతో విద్యార్థులు, యువత ఇబ్బందులు పడుతున్నారని ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సరైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల ఒత్తిడి, పేపర్ లీకేజీలు లేని మెరుగైన విద్యా వ్యవస్థ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో రాహుల్‌గాంధీ ఈ వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య, సకాలంలో ఉద్యోగ నియామకాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయ్యూబ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, మారంరెడ్డి కౌటిల్‌రెడ్డి, తౌటం ఝాన్సీరాణి రవీందర్, గోవిందు శ్వేత, వేణు చారి, అలువాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


