నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి
ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
చెరువుల్లో పారిశుద్ధ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్ : నగరంలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారం లోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం మడికొండ, బంధం, సిద్ధేశ్వర గుండం, ఉర్సుగుట్ట, బేస్తం, అగర్తల, కట్టమల్లన్న, చిన్నవడ్డేపల్లి, ముచ్చర్ల, హసన్‌పర్తి, భీమారం తదితర నిమజ్జన చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐదవ రోజు నుంచే నిమజ్జనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువుల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులను వేగంగా పూర్తి చేసి, నిమజ్జన ప్రాంతాల్లో సిబ్బందిని ముందుగానే కేటాయించాలన్నారు. క్రేన్లకు అవసరమైన ఇంధనాన్ని సమకూర్చుకోవాలని, ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌బీ, డీఆర్‌ఎఫ్, మైనింగ్, మత్స్య తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తెప్పలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు, ఉత్సవ కమిటీలకు తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వెలుతురు సదుపాయాల్లో లోటు లేకుండా చూడాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశీలనలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఆరోగ్యాధికారి డా. రాజేష్, ఈఈలు రవికుమార్, సంజయ్‌కుమార్, మహేందర్, సంతోష్‌బాబు, మాధవీలత, డీఈ రాజ్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ గోల్కొండ శ్రీను, ఏఈ హరికుమార్, ఇన్‌స్పెక్టర్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

