జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం
కౌన్సిలర్ వర్సెస్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వివాదం
డీజిల్ బకాయిలు.. జేసీబీ పనులపై ఆరా
వైరల్ ఆడియోలో లక్షల రూపాయల వ్యవహారం ప్రస్తావన
జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మధ్య నెలకొన్న వివాదం తాజాగా వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణతో మరింత ముదిరింది. పాత మున్సిపల్ కార్యాలయంలోని శానిటరీ విభాగం గది వినియోగం, డీజిల్ నిర్వహణ, పెట్రోల్ బంకుల పాత బకాయిలు, జేసీబీ పనుల ఖర్చులపై ఇప్పటికే విభేదాలు ఉండగా.. తాజాగా బయటకు వచ్చిన ఆడియో చర్చనీయాంశంగా మారింది. శానిటరీ విభాగం గదికి నిబంధనలకు విరుద్ధంగా తాళం వేస్తున్నారని, ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు చెప్పేందుకు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు చెబుతున్నారు. అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఉద్యోగ నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. డీజిల్ టోకెన్లు, డబ్బులకు సంబంధించిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు.
డీజిల్ బకాయిలు.. జేసీబీ లెక్కలు
వైరల్ ఆడియోలో డీజిల్ బంకు, సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న పాత బకాయిలు, సుమారు రూ.7 లక్షల జేసీబీ పనుల ఫైల్ ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. డీజిల్ బంకుల వ్యవహారాన్ని మున్సిపల్ కమిషనర్ చూస్తున్నారని శానిటరీ ఇన్‌స్పెక్టర్ చెప్పినట్లు సంభాషణలో ఉంది. జేసీబీ పనులకు సంబంధించిన ఫైల్ కూడా కమిషనర్ వద్దే ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలు తేలాలంటే మున్సిపల్ వాహనాల డీజిల్ బిల్లులు, లాగ్‌బుక్స్, జీపీఎస్ వివరాలు, జేసీబీ పనుల వోచర్లు, వర్క్ ఆర్డర్లు, పరిపాలనా అనుమతులను పరిశీలించాల్సి ఉంది. ఈ అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కౌన్సిలర్లు స్పష్టం చేయడంతో జమ్మికుంట మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

