ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
వెలుగుమట్లలో పనుల పురోగతిపై సమీక్ష
మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు ఆదేశాలు
ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్
కాకతీయ, ఖమ్మం బ్యూరో: వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను సంబంధిత పథకం అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు స్లాబ్, గోడలు, ప్లాస్టరింగ్, రంగులు వేసే దశల్లో ఎన్ని ఉన్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి కనెక్షన్ల ఏర్పాటు పనులతో పాటు ప్రహరీ గోడల నిర్మాణ పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

