కాలం గడిచినా కరగని స్నేహం!
బాల్యమిత్రుడి కుటుంబానికి రూ.81000 నగదు అందజేత
మానవత్వాన్ని చాటుకున్న 1999-2000 పదో తరగతి విద్యార్థులు
కాకతీయ,రాయపర్తి :కాలం వేగంగా గడిచిపోవచ్చు…వయసుతో పాటు బాధ్యతలు పెరిగిపోవచ్చు… కానీ నిజమైన స్నేహబంధం మాత్రం ఎప్పటికీ కరిగిపోదని శ్రీ వెంకటేశ్వర పాఠశాల 1999-2000 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు నిరూపించారు.వారంతా ఒక్కటై స్నేహితుల సంతోషాల్లోనే కాదు.. కష్టాల్లోనూ అండగా ఉంటామని అన్నారు.దాదాపు 25 సంవత్సరాల క్రితం పాఠశాల విద్య పూర్తి చేసి,ఎవరి జీవితాల్లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ…కష్టాల్లో ఉన్న మిత్రుడి కుటుంబాన్ని చూసి చలించిపోయారు.
వివరాల్లోకి వెళ్తే…రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మైస మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోవడంతో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర అశోకసంద్రంలో మునిగిపోయారు.అలాగే చిన్న వయసులోనే కన్నుమూయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.మహేందర్ అకాల మరణ వార్త తెలుసుకున్న ఆయన పదో తరగతి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.కేవలం సానుభూతిని తెలిపి ఊరుకోకుండా,ఆ కుటుంబానికి కొండత అండగా నిలవాలని నిరూపించుకున్నారు.వాట్సాప్ గ్రూపులు,ఫోన్ కాల్స్ ద్వారా పూర్వ విద్యార్థులంతా ఒక్కటే విరాళాలు సేకరించారు.రూ. 81,000 నగదు ఆర్థిక సహాయాన్ని బుధవారం మహేందర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు నేరుగా అందజేశారు.భవిష్యత్తులోనూ మహేందర్ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చిన మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం అంటూ భగవద్వేగానికి లోనయ్యారు.ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు అనిల్ కుమార్,సతీష్ కుమార్,గోలి మహేందర్ రెడ్డి,సోమేశ్వర్,రవి ప్రసాద్,రాము,రవి తదితరులు పాల్గొన్నారు.

