రావణాసురుడి ప్రతిమపై ప్రతిరూపాల ఘటనపై చర్యలు తీసుకోవాలి
ఆధారాలను పరిశీలించి వాస్తవాలు వెలికితీయాలి
బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ డిమాండ్
కాకతీయ, పరకాల: దసరా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ ప్రతిరూపాలను రావణాసురుడి ప్రతిమపై ఏర్పాటు చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ కోరారు. ఈ ఘటనపై గురువారం పరకాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ప్రచారంలో ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, కార్యక్రమాలు చట్టపరిధిలో జరగాలని అన్నారు. ఘటనకు సంబంధించిన చిత్రాలు, దృశ్యాలు, ఇతర ఆధారాలను పరిశీలించి వాస్తవాలను వెలికితీయాలని, చట్ట ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హనుమకొండ జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, జిల్లా నాయకుడు బాసాని సోమరాజు, సామాజిక మాధ్యమాల విభాగం సమన్వయకర్త మెంతుల సురేష్ పాల్గొన్నారు.

