కల్పలత సూపర్‌బజార్‌లో ప్రక్షాళనకు శ్రీకారం!
రూ.80 లక్షల నిధుల అవకతవకలపై సమగ్ర విచారణ
అడ్మినిస్ట్రేటర్‌గా ఆర్డీఓ వెంకటేష్ నియామకం
కాకతీయ, వరంగల్ : వరంగల్ రంగంపేటలోని కల్పలత సూపర్‌బజార్ కోఆపరేటివ్ స్టోర్‌లో పరిపాలనను ప్రక్షాళన చేసి, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ చర్యలు చేపట్టారు. స్టోర్ అడ్మినిస్ట్రేటర్‌గా హనుమకొండ ఆర్డీఓ ఎన్. వెంకటేష్‌ను నియమించగా, ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. స్టోర్‌లో సుమారు రూ.80 లక్షల నిధులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు జిల్లా సహకార అధికారి బాణావత్ మోహన్ నిర్వహించిన ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత నెలలో కే. కోదండరాములును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించగా, తాజాగా సమగ్ర విచారణ, నిర్వహణలో పారదర్శకత లక్ష్యంగా ఆ బాధ్యతలను వెంకటేష్‌కు అప్పగించారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 34(1)(సి) ప్రకారం ఈ నియామకం చేపట్టారు.
ఆర్థిక రికార్డుల సమర్పణకు ఆదేశాలు
బాధ్యతలు స్వీకరించిన అనంతరం సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ సంధ్యారాణికి ఆర్డీఓ వెంకటేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. స్టోర్ ఆదాయ, వ్యయాలు, ఆర్థిక లావాదేవీలు, నిధుల వినియోగం, ఇతర రికార్డుల వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి అందించాలని సూచించారు. నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయా అనే అంశంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తామని తెలిపారు. స్టోర్ కార్యకలాపాలు సక్రమంగా కొనసాగడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పారదర్శక పాలనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

